కేరళకు దాదాపు 580 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. కానీ ఇక్కడ స్కూబా డైవింగ్ అంటే కేవలం బీచ్ ల పొడవు గురించి కాదు. అలల క్రింద వేచి ఉన్న అద్భుత ప్రపంచాన్ని వీక్షించడమే ఇందులోని ప్రధాన అంశం. మనకు తెలిసిన అలల లయకు అవతల, ఎంతో నిశ్శబ్దంగా, నిదానంగా మరియు ముందే ఊహించలేనంత వైవిధ్యంగా ఉండే మరొక ప్రపంచం దాగి ఉంది. చేపల సమూహాలు ఒకే క్రమపద్ధతిలో కలిసి కదులుతుంటాయి. సముద్ర గర్భం నుండి పైకి విస్తరించిన రాతి నిర్మాణాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అక్కడక్కడ పగడపు దిబ్బలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఒక తాబేలు లేదా జెల్లీఫిష్ ఎటువంటి హడావుడి లేకుండా ఎంతో నిదానంగా మీ ముందు నుండి సాగిపోతాయి.


అదే ఇక్కడి అసలైన స్పెషాలిటీ. కేవలం చూడటమే కాదు, సడన్‌గా మనకు కనిపించే ఆ వింత జీవులే అసలైన థ్రిల్ ఇస్తాయి. మనం డైవింగ్ చేసినప్పుడు సముద్రం లోపల ఏ అద్భుతం కనిపిస్తుందో ముందే తెలియకపోవడమే అసలైన మజా. అదే అసలైన అడ్వెంచర్.


తీరప్రాంతం వెంబడి కొన్ని చోట్ల స్కూబా డైవింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, తిరువనంతపురం మరియు కొచ్చిలు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతాలు. తిరువనంతపురంలోని కోవలం (కోవళం) మరియు వర్కలలు బహిరంగ సముద్ర ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందగా, కొచ్చిలోని కడవంత్ర మరియు కలూర్ ప్రాంతాలు మరింత నియంత్రిత వాతావరణంలో డైవింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. కడమకుడి ద్వీప పరిసర ప్రాంతాలలో సైతం స్కూబా డైవింగ్ విశేష జనాదరణ పొందింది. ఆయా ప్రాంతాలను బట్టి కనిపించే దృశ్య వైవిధ్యం కూడా మారుతుంటుంది. ఉదాహరణకు, కోవలంలో చేసే డైవింగ్ పగడపు చేపల సమూహాలను, సముద్ర గర్భంలోని రాతి లోయలను మరియు ఇసుక తిన్నెలను ఆవిష్కరిస్తుంది; అదే వర్కల సమీప ప్రాంతాలు ఏళ్ల తరబడి అలల తాకిడికి రూపుదిద్దుకున్న సహజ సాగర నిర్మాణాల దృశ్యాలను అందిస్తాయి. కొచ్చి యొక్క భౌగోళిక తీర అమరిక కారణంగా, అక్కడి జలాలు ఒక విభిన్నమైన డైవింగ్ వాతావరణాన్ని అందిస్తాయి.


లోతు, భూస్వరూపం మరియు నీటి స్పష్టతను బట్టి ప్రతి ప్రాంతం సముద్ర గర్భంలో ఒక విభిన్నమైన నేపథ్యాన్ని అందిస్తుంది.


వర్షాకాలం ముగిసిన తర్వాత, సాధారణంగా అక్టోబర్ నుండి ఏప్రిల్ మాసాల మధ్య ఈ డైవింగ్ సీజన్ సాగుతుంది. ఈ కాలంలో సముద్రం సాపేక్షంగా ప్రశాంతంగా ఉండి, స్థిరమైన పరిస్థితులతో పాటు నీటి లోపల స్పష్టత మెరుగ్గా ఉంటుంది. కల్లోల సముద్ర పరిస్థితులు మరియు తీవ్రమైన నీటి ప్రవాహాల కారణంగా వర్షాకాలంలో డైవింగ్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయి.


కేరళలోని అత్యధిక శాతం నిర్వాహకులు మొదటిసారి వచ్చేవారి కొరకు ప్రాథమిక 'ట్రై డైవ్స్' సదుపాయాన్ని మరియు గుర్తింపు పత్రాలు గల నిపుణుల కొరకు ఉన్నత స్థాయి డైవింగ్ సేవలను అందిస్తున్నారు. ఈ కార్యకలాపాలు పర్యావరణ హితమైన రక్షిత సాగర ప్రాంతాలలో నిర్వహించబడతాయి; నిర్వాహకులు పర్యాటక మరియు తీరప్రాంత అధికారులు విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ‍‌‍‍‌‍‌‍‍‌ మరిముఖ్యంగా మీరు బాగా లోపలికి వెళ్లాలన్నా లేదా అడ్వాన్స్‌డ్ కోర్సులు చేయాలన్నా ముందే బుక్ చేసుకోవడం, హెల్త్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం అవసరం కావచ్చు. అంతేకాదు, సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ డైవింగ్ చేయిస్తారు ‍‌‍‍‌‍‌‍‍‌.


చిట్కాలు

మీ స్థాయికి తగ్గట్లు ఎంచుకోండి

మీ కంఫర్ట్‌, అనుభవ స్థాయిని బట్టి మీకు సెట్ అయ్యే డైవింగ్ లోతుల్ని ఎంచుకోండి.

ముందుగానే ప్రణాళిక చేసుకోండి

కొన్ని రకాల డైవింగ్‌ల కొరకు ముందస్తు బుకింగ్ లేదా మెడికల్ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది, అందుకే ముందే ప్లాన్ చేసుకోండి.

ముందు భద్రత

సర్టిఫైడ్ న శిక్షకులు అందించే అన్ని రక్షణ మార్గదర్శకాలను మరియు సూచనలను తప్పనిసరిగా పాటించండి.

గుర్తింపు పొందిన ఆపరేటర్లను ఎంచుకోండి

మీ భద్రత కోసం, మంచి క్వాలిటీ వస్తువుల కోసం ఎప్పుడూ కేరళ టూరిజం పర్మిషన్ ఉన్న సెంటర్లలోనే డైవింగ్ చేయండి.